- *ప్రజల సంపూర్ణ సహకారంతోనే అద్భుత విశాఖ సాధన*
*స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో స్థానిక ఎంపీ శ్రీభరత్
*ఆపరేషన్ లంగ్స్ సరికొత్త మార్పునకు శ్రీకారమని ఉద్ఘాటన
**స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలి ః జిల్లా కలెక్టర్
విశాఖపట్టణం, అక్టోబర్ 06 ః ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలు గడించిన విశాఖ మహా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని విశాఖపట్టణం ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ నగర అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజా బాధ్యత పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పరిశుభ్రత అనే విషయంలో ప్రజల్లో మార్పు రావాలని, విశాఖ విశిష్ఠతను పెంచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ లంగ్స్’ ఒక సానుకూల మార్పుకు నాంది అన్నారు. ఈ చర్యపై నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది ప్రజలు మంచి నిర్ణయంగా అభిప్రాయపడ్డారని చెప్పారు. ఫుట్‌పాత్‌లు ప్రజలు నడవడానికి మాత్రమేనని, అవి వ్యాపార ఆక్రమణలకు వేదిక కాకూడదని స్పష్టం చేశారు. “ఇలాంటి సమస్య ఒక్క విశాఖలోనే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఉందని గుర్తు చేశారు. జూ పార్క్, కైలాసగిరి ప్రాంతాల్లో చేపట్టబోయే వినూత్న ప్రాజెక్టులపై అధ్యయనం కోసం సింగపూర్ పర్యటన చేసినట్లు ఎంపీ చెప్పారు. “సింగపూర్‌లోని సెంటోసా పార్కుల్లో పరిస్థితులను పరిశీలించామని, అక్కడ ‘గార్డెన్ ఇన్ ది సిటీ’ అనే నినాదం ఇప్పుడు ‘బయో ఫ్లెక్స్ సిటీ’గా రూపాంతరం చెందిందని వివరించారు. జంతువులతో పాటే మనుషులు జీవన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. సింగపూర్‌లో మనుషులకే కాదు, జంతువులకూ ప్రత్యేక నడక దారులు, వంతెనలు ఉన్నాయని వివరించారు. పరిశుభ్రత పట్ల అక్కడి ప్రజల్లో ఉన్న బాధ్యత మనకు కూడా అలవాటు కావాల్సి ఉందని అన్నారు.
@ఇటీవలి దుకాణాల తొలగింపు వెనుక మంచి ఉద్దేశం ఉందని, సింగపూర్ మాదిరిగా వెండింగ్ సముదాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉందని ఎంపీ స్పష్టం చేశారు. వాటిలో ప్రజలు అన్ని రకాల వస్తువులను ఒకేచోట కొనుగోలు చేయగలరని అభిప్రాయప్డారు. “క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు నడక, వ్యాయామం అవసరమని పేర్కొన్నారు. నగర డ్రైన్ల నిర్వహణకు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు తమ ప్రచార కార్యక్రమాల్లో ప్లాస్టిక్ జెండాలు, ఫ్లెక్సీలకు బదులుగా డిజిటల్ బోర్డులను వినియోగించుకోవాలని ఎంపీ భరత్ సూచించారు.
*నగర పరిశుభ్రత – ప్రజా భాగస్వామ్యంతో సాధన*
@దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్టణం అద్భుత నగరం, నేచురల్ సిటీ దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
పేర్కొన్నారు. నగర అభివృద్ధికి వినూత్న పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ”కాన్సర్ అంశంలో విశాఖ మొదటి స్థానంలో ఉండటం విచారకరం. కాన్సర్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లు అవసరం” అని సూచించారు. విశాఖ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం సదుపాయాల మెరుగుదలతో పాటు రాత్రి 1.00 గంట వరకు హోటళ్లను కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. “నగర ప్రగతికి వినూత్న నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది,” అని పేర్కొన్నారు.
*ఇన్ని అవార్డులు రావటం విశాఖ గర్వకారణం*
@ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
“విశాఖ మహా నగరానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రోజు ఇన్ని అవార్డులు రావటం విశాఖ గర్వకారణం,” అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. “పనికిరాని వస్తువులను కాలువల్లో పడేయడం సరికాదు. ప్రజల్లో మరింత మార్పు రావాలి,” అని సూచించారు. “దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చీపురు చేతబట్టి స్వచ్ఛత కార్యక్రమాలు ప్రారంభించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పౌరుడు పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలి,” అని పిలుపునిచ్చారు.
*స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలి*
@జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. జిల్లాలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 79 పంచాయతీల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, అందరి కృషిని గుర్తించి అవార్డులు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసి విజన్ ప్రణాళికను రూపొందించామని వివరించారు. 15 శాతం వృద్ధి సాధించే దిశగా అందరూ కృషి చేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని హితవు పలికారు. టెర్రాస్ గార్డెనింగ్‌ను ఒక ఉద్యమంలా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇంటి వద్దే తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా మన ప్రవర్తనలో మార్పు రావాలని, స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రజలే ప్రధాన భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 45 జిల్లా స్థాయి అవార్డులు, 7 రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించి విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. డ్రైన్స్ ఇంకా సముద్రంలో కలుస్తున్నాయని, ఈ పరిస్థితి మారాలని అభిప్రాయపడ్డారు. 79 పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం అని కలెక్టర్ పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ, “స్వచ్ఛ అవార్డుల స్ఫూర్తితో మరింత కష్టపడాలి, జాతీయ స్థాయి అవార్డులు సాధించాలి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు నాగలక్ష్మి, రాము, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు మాట్లాడారు. సుందర నగరాన్ని తీర్చిద్దేందుకు అధికారులు, ప్రజలు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అవార్డు గ్రహీతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, జీవీఎంసీ అధికారులు, అవార్డు గ్రహీతలు, వివిధ సమాఖ్య సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….
జారీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్టణం.

