శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. (కలం లీడర్ న్యూస్)
భోగి మంటల వెలుగుల్లో జిగేలుమన్న సింహగిరి – అపూర్వ ఆధ్యాత్మిక శోభతో సంక్రాంతి సంబరాలు.
• శాస్త్రోక్తంగా భోగి మంటలు వెలిగించిన ఈవో ఎన్. సుజాత మరియు ఆలయ అధికారులు.
• పల్లె వాతావరణాన్ని తలపించిన వరాహ క్షేత్రం.
• సామాన్య భక్తులకే పెద్దపీట.
…… ఇఓ ఎన్ సుజాత
సింహాచలం, జనవరి 14:
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం,
సింహాచలం నేడు భోగి పర్వదినం సందర్భంగా అపూర్వ వైభవంతో దర్శనమిచ్చింది. ధనుర్మాస పుణ్యకాలంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భోగి వేడుకలు భక్తుల మనసులను పరవశింపజేశాయి.
వేకువజాము నుంచే నీలిమేఘంలా భక్తుల ప్రవాహం సింహగిరిని కమ్మేయడంతో ఆలయ ప్రాంగణమంతా “గోవిందా… గోవిందా…” అనే నామస్మరణతో మార్మోగింది.
స్వామివారి సన్నిధి వద్ద భక్తుల హృదయాల్లో భక్తి జ్వాలలు వెలిగాయి. శాస్త్రోక్తంగా భోగి మంటలు , ధనుర్మాస చలిని, అజ్ఞానాంధకారాన్ని తొలగించే ప్రతీకగా స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో భోగి మంటలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. సుజాత సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సింగం రాధ, ఏఈఓ కె. తిరుమలేశ్వరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె సీమల సౌందర్యం – సింహగిరిపై గ్రామీణ వైభవం పట్నం వాసులకు పల్లెటూరి మాధుర్యాన్ని పరిచయం చేసేలా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. వరి కుప్పలు, గడ్డి మేటలు, చెరకు గడలు, పూరి గుడిసెలు, ఎడ్ల బండ్లు, కుమ్మరి కళా ప్రదర్శనలు, గంగిరెద్దుల విన్యాసాలు, తప్పెటగుళ్ల మోత, జంగమ దేవరల దీవెనలు, హరిదాసుల కీర్తనలు – ఇవన్నీ కలసి సింహగిరిని అచ్చమైన పల్లెటూరిలా మార్చాయి.
రంగురంగుల రంగవల్లికలు, ముత్యాల ముగ్గులతో ఆలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపించింది. చిన్నారులకు భోగి పళ్లు పోయడం, వారి నృత్య ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
“సామాన్య భక్తుడే వీఐపీ” – సేవా దృక్పథానికి నిదర్శనం,భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈవో ఎన్. సుజాత గారు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీలను సైతం నీలాద్రి గుమ్మం నుంచే దర్శనానికి అనుమతిస్తూ, క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించారు.
క్యూలైన్లలో మంచినీటి సదుపాయాలు, అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ భక్తుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.
నిత్య అన్నదానం – పండుగ రుచులతో భక్తుల తృప్తి కలిగే విధముగా దర్శనం అనంతరం స్వామివారి నిత్య అన్నదానంలో భాగంగా భోగి పండుగ వంటకాలు – బూరెలు, పులిహోర, రుచికరమైన కూరలతో కూడిన అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు. భక్తులు ఆనందంగా స్వీకరించి తృప్తిగా వెనుదిరిగారు.
ట్రాఫిక్ నియంత్రణలోపోలీసులసమర్థనిర్వహణ
భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణలో గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ సన్యాసినాయుడు, ట్రాఫిక్ సీఐ సురేష్ తమ సిబ్బందితో కలిసి విశేష కృషి చేశారు. ఘాట్ రోడ్డులోనూ, ఆలయ పరిసరాల్లోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
మొత్తంగా, భోగి పర్వదినం నాడు సింహగిరిపై నెలకొన్న పండుగ వాతావరణం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం భక్తులకు ఒక అపూర్వమైన, మరపురాని అనుభూతిని అందించింది.
సింహాద్రి అప్పన్న కృపతో భక్తుల హృదయాల్లో భక్తి జ్యోతి మరింత ప్రకాశించింది.
సదా
స్వామివారి సేవలో
కార్య నిర్వహణాధికారి
సింహాచలం దేవస్థానం.

